ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సచివాలయ పరీక్షపై సుదీర్ఘ లేఖ రాశారు. మీ పాలనలో ప్రజలు కష్టపడుతున్నారని అందులో పేర్కొన్నారు. గత నాలుగు నెలల పాలనలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని లేఖలో ఆరోపించారు. అందుకు అనుభవరాహిత్యం, ఆశ్రిత పక్షపాతం, కక్ష సాధింపు వైఖరే కారణమని అన్నారు. గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరగడం వైకాపా పాలన దుస్థితికి తాజా నిదర్శనమని విమర్శించారు. ఈ ఘటన ఏపీపీఎస్సీ ప్రతిష్ఠకే మాయని మచ్చ తెచ్చిందన్నారు. దాదాపు 19లక్షల అభ్యర్థులు, కుటుంబ సభ్యులకు వేదన మిగిల్చిందని బాబు లేఖలో పేర్కోన్నారు.
వైకాపాకు చెందిన వారి బంధువులు, స్నేహితులకే మంచి మార్కులు వచ్చాయని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకైందనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని ప్రశ్నించారు. ప్రశ్న పత్రాలు ఏపీపీఎస్సీ కంటే ముందే విశ్రాంత అధికారి, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఎలా చేరాయని నిలదీశారు. పొరుగు సేవల సిబ్బందికి, వారి బంధువులకే టాప్ ర్యాంకులు రావడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణం పరీక్షలు రద్దుచేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయ పరీక్షల పేపర్ లీకేజీకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రాజీనామా చేస్తారో లేక పంచాయతీ, విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.